టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

Feb 16 2026 7:20 AM | Updated on Feb 16 2026 7:20 AM

టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

మోటకొండూరు: మోటకొండూర్‌ మండలం కాటేపల్లి గ్రామ పరిధిలోని శ్రీజీ టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. కంపెనీలో నత్రజని శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఈ కంపెనీని తమ గ్రామం నుంచి తరలించాలని కాటేపల్లి గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిబంధనల ప్రకారం శ్రీజీ టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగించడానికి 2025 డిసెంబర్‌ 29న తాత్కాలిక అనుమతి లభించింది. కానీ 2025 డిసెంబర్‌ 18నే కంపెనీ యాజమాన్యం అక్రమంగా ట్రయల్స్‌ ప్రారంభించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక అనుమతి గడువు కూడా ఫిబ్రవరి 3తో ముగిసిందని, ప్రస్తుతం కంపెనీ నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని, ఒకవేళ ఉంటే బహిరంగంగా చూపించాలని గ్రామస్తులు సవాల్‌ చేస్తున్నారు. ఇటీవల పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నల్లగొండ రీజినల్‌ ఆఫీసర్‌ పరిశ్రమను సందర్శించి అన్ని నిబంధనలు పాటిస్తున్నారని నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ అక్కడ నత్రజని శుద్ధి వ్యవస్థ పనులు జరుగుతూనే ఉన్నాయి. పీసీబీ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాటేపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ పరిశ్రమపై గ్రామ పంచాయతీ అధికారులు, ఎమ్మార్వో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలోనూ ఆందోళనలు..

శ్రీజీ టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీతో పాటు మరో టైర్ల కంపెనీల ద్వారా వెలువడే పొగ, కాలుష్యంతో పరిసర ప్రాంతంలోని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలోనూ గ్రామస్తులు ఆందోళన చేశారు. కంపెనీ కాటేపల్లి నుంచి తరలించాలని లేదా మూసివేయాలని జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించారు. ఈ అగ్నిప్రమాదం పెద్దగై ఉంటే పక్కనే ఉన్న ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీకి మంటలు నష్టం భారీ ఎత్తున ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

కమ్ముకున్న దట్టమైన పొగ

పరిశ్రమను తరలించాలని కాటేపల్లి గ్రామస్తుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement