ఓటు వేయలేదని బెదిరింపులు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డులో కొందరు తమకు ఓట్లు వేయలేదంటూ ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు, వారి మద్దతుదారులు స్థానిక అర్బన్ కాలనీకి చెందిన ఓటర్ల ఇంటి ముందు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. 1వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించింది. స్వల్ప తేడాతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఓట్ల లెక్కింపు జరిగిన రోజు రాత్రి నుంచి గెలుపొందిన అభ్యర్థి మద్దతుదారులపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి తమకు ఓటు వేయని వారి ఇళ్ల ముందు బీరు సీసాలు పగులగొట్టడంతో పాటు తామిచ్చిన చీరలు, నగదు, ఇతర వస్తువులు తిరిగి ఇవ్వాలంటూ హెచ్చరించారు. దీంతో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన చీరలను తీసుకొచ్చి వీధుల్లో కుప్పగా పోశారు. ఈ మేరకు అర్బన్ కాలనీ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మీనరసయ్య తెలిపారు. పద్మశాలీలే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు, బెదిరింపులను నియంత్రించాలని పద్మశాలీ సంఘం నాయకులు పోలీసులను కోరారు.
ఓటర్ల ఇళ్ల ముందు బీరు సీసాలు
పగలగొట్టిన ఓడిపోయిన అభ్యర్థుల
అనుచరులు
వారిచ్చిన చీరలు, ఇతర వస్తువులను రోడ్డుపై పడేసిన ఓటర్లు
పోలీసులకు ఫిర్యాదు


