తెలంగాణ రాజకీయాలను మునుగోడు శాసిస్తుంది
మీ ఆశీర్వాదం, సహకారంతో ఆ రోజు వస్తుంది
తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు ఇంకా తీరలేదు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చండూరు : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మునుగోడు గడ్డ శాసించే రోజు వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ‘నాకు పదవిపై వ్యామోహం లేదు. రాజగోపాల్‌రెడ్డి ఏం చేస్తాడో అని రాష్ట్రం మొత్తం మునుగోడు వైపు చూస్తోంది.
గత ప్రభుత్వంలో నా రాజీనామా వల్ల నాకు అన్యాయం జరిగినా.. మునుగోడుకు న్యాయం జరిగింది. నా రాజీనామాతో అప్పటి కేబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చాను’ అని అన్నారు. సోమవారం ఆయన చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల సభలో మాట్లాడారు. ప్రజలు మీది ఏ ఊరు అంటే గతంలో నల్లగొండ అని చెప్పే వాళ్లు. ఇప్పుడు మాది మునుగోడు అని చెప్పుకునే స్థాయికి తెచ్చానని అన్నారు. చండూరు మున్సిపాలిటీలో కనీసం నివాస స్థలం లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలం ఇస్తానని, ప్రభుత్వం స్ధలం ఉన్నా లేకున్నా సొంతంగా కొనైనా వారికి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ రాని వృద్ధులకు.. ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు తానే నెలకు 2వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ రూ.5వేలు ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
డబ్బులకు ఓటు అమ్ముకోవద్దు..
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దని, డబ్బులు పెట్టిన వ్యక్తి దగ్గరికి పనికి పోతే పుణ్యానికి ఓటు వేశావా అని ఎదురు ప్రశ్నిస్తారని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులతో వస్తున్నారు మోసపోవద్దని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, అనంత చంద్రశేఖర్, గిరిబాబు, కోడి శ్రీనివాసులు, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


