లారీ డ్రైవర్‌ను బెదిరించిన ఇద్దరి అరెస్ట్
నార్కట్‌పల్లి : లారీ డ్రైవర్‌ను చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నార్కట్‌పల్లి ఎస్‌ఐ పి.విష్ణుమూర్తి తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సునీల్‌తివారి లారీలో వెలిమినేడు నుంచి ఐరన్ లోడు వేసుకొని బయల్దేరాడు. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటంలో ఉన్న ఒక కంపెని వద్ద లారీ ఆపాడు. వంట చేసుకోవడానికి అవసరమైన సామగ్రి కోసం ఏపీ లింగోటంలోని కిరాణాషాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చి లారీ డ్రైవర్‌ను బలవంతంగా వాహనంపై ఎక్కించుకొని కొద్దిదూరం తీసుకెళ్లారు. ఇనుప రాడ్డుతో కొట్టి చంపుతామని బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని స్కూటీపై పారిపోయారు. లారీ డ్రైవర్ వెంటనే నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్‌ను బెదిరించిన మాద యడవల్లి గ్రామానికి చెందిన లింగస్వామి, నార్కట్‌పల్లికి చెందిన ఎస్‌కే ఉమర్‌ను అరెస్ట్ చేశారు. లారీ డ్రైవర్ వద్ద నుంచి వారు లాక్కెళ్లిన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
9న అప్రెంటీస్ మేళా
డిండి : మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేళాకు హాజరయ్యే ఆసక్తిగల విద్యార్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9705182677 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
ఆమనగల్లులో గుప్తనిధుల కలకలం
వేములపల్లి : మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శుక్రవారం గుప్తనిధుల కలకలం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బీమారం–సూర్యాపేట రహదారి సమీపంలో పెరుమళ్ల కృష్ణయ్య పొలం వద్ద పురాతన కాలానికి చెందిన శివుడి శిలాఫలకం, నాటి లిపితో కూడిన బండరాయి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ రాయిపై కుంకుమ, పసుపు చల్లి తవ్వకాలు చేసి, తిరిగి రాయిని అక్కడే ప్రతిష్ఠించి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన కృష్ణయ్య ఈ విషయాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో, గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామంలో చర్చ సాగుతోంది.


