ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
మిర్యాలగూడ, మోటకొండూరు : తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్థాపానికి గురైన ప్రేమ జంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం తేర్యాల గ్రామానికి చెందిన వరి కుప్పల రాకేశ్(21), ఓర్సు సౌమ్య దగ్గరి బంధువులు. రాకేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా సౌమ్య ఇంటర్ చదువుతున్నది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు మందలించారు. దాంతో రాకేశ్, సౌమ్య దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపించారు. వెంటనే కుటుంబసభ్యులు 100కు డయల్ చేసి వివరాలు వెల్లడించారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరగా చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మోటకొండూరులో మిస్సింగ్ కేసు
సౌమ్య కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఉదయం బయటికి వెళ్లింది. ఆమె మరో వ్యక్తితో మిర్యాలగూడ ప్రాంతంలో కనిపించిందని కొంత మంది చెప్పడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం


