ప్రలోభాలతో ప్రసన్నం! | - | Sakshi
Sakshi News home page

ప్రలోభాలతో ప్రసన్నం!

Feb 7 2026 2:47 PM | Updated on Feb 7 2026 2:47 PM

ప్రలోభాలతో ప్రసన్నం!

ప్రలోభాలతో ప్రసన్నం!

తాయిలాలపై దృష్టి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రలోభాలు మొదలయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. డివిజన్లు, వార్డుల వారీగా తమ పరిస్థితి ఏమిటో ఓ అంచనాకు వస్తున్న అభ్యర్థులు ఎన్నికల్లో బయటపడే మార్గాలను వెదుకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రచారం కొనసాగిస్తూ.. రాత్రి పూట మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పురుష ఓటర్లను మందు పార్టీలతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

మందుతో విందు భోజనాలు

ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మందు పార్టీలు ఇస్తున్నారు. విందులు ఏర్పాటు చేస్తున్నారు. పలు డివిజన్లలోని సంఘాలు, కమ్యూనిటీ గ్రూపులకు విందులు ఇస్తున్నారు. ముఖ్యంగా యువతకు, కాలనీల్లో ఉండే ఆయా సంఘాలకు సాయంత్రమైతే దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగస్తులు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ అసోసియేషన్లు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అసోసియేషన్‌ బాధ్యులకు నగదు ఇస్తామంటూ ఆశజూపి వారి మద్దతు కోరుతున్నట్లు తెలిసింది. అపార్ట్‌మెంట్లలోని ఓటర్లకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ముఖ్యంగా నల్లగొండతో పాటు మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. కొన్ని అపార్ట్‌మెంట్లలో బయటకు డబ్బు తీసుకోమని చెబుతుండడంతో.. వారికి ఖరీదైన మద్యంతో మర్యాద చేయాల్సి వస్తోందని, అందుకు ఎక్కువ ఖర్చు అవుతోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు.

రహస్య ప్రాంతాల్లో పార్టీలు

నల్లగొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం మాత్రం ఎవరెవరికి పార్టీలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలనే విషయాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఓటరు జాబితా ఆధారంగా అభ్యర్ధులు.. ఉదయం నుంచే ఓటర్ల సమయాన్ని కోరుతున్నారు. తమకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వార్డులో ఉన్న ఉద్యోగులను రహస్య ప్రాంతాలకు తరలించి ప్రసన్నం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఓ చోటకు చేర్చుతున్నారు. ఇక రాత్రివేళ బయటకు రాలేని ఉద్యోగులు, ఇతరుల కోసం నేరుగా మద్యం బాటిళ్లను తీసుకెళ్లి ఇస్తున్నట్లు సమాచారం.

అప్పుడే మద్యం పంపిణీ

పలు డివిజన్లు, వార్డుల్లో అప్పుడే ఇంటింటికీ మద్యం బాటిళ్లు పంపిణీ చేయడం మొదలైనట్లు చెబుతున్నారు. డబ్బుల పంపిణీ మినహా మిగిలిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాల అమలు దిశగా సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు రోజు వారీ ఖర్చులు చూసి లబోదిబోమంటున్నారు.

ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు తాయిలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఓటుకు ఎంత పంచాలన్న దానిపైనా కసరత్తు చేస్తున్నారు. కొన్ని డివిజన్లు, వార్డుల్లో మహిళలకు కొందరు అభ్యర్థులు చీరలు, సారెలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాటితో పాటు కొన్నిచోట్ల స్వీట్లు ప్యాకెట్లను అందిస్తున్నారు. కొందరు అభ్యర్థుల పరిస్థితి ఇలా ఉంటే మరి కొందరు మహిళలకు కాలనీల వారీగా గెటుగెదర్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

ఫ పొద్దంతా ప్రచారం.. రాత్రి వేళ ఓటర్లకు దావత్‌లు

ఫ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రణాళిక

ఫ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యునిటీలకు ప్రత్యేకంగా సిట్టింగ్‌

ఫ మహిళలకు చీరల పంపిణీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement