కాకతీయుల సామ్రాజ్యంలో భాగం..
సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్‌ల వివరాలు
సూర్యాపేట : సూర్యాపేట పట్టణానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో పినవీరభద్రుడి పాలనలో పిల్లలమర్రి సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నాడు భానుపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలానుగుణంగా భానుపురిగా, సూర్యాపేటగా మారింది. 1902లోనే తాలూకాగా మారగా.. 1952లో సూర్యాపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రాంతం సూర్యాపేట.
ఉద్యమాల గడ్డ
సూర్యాపేట పూర్వం నుంచి ఉద్యమాల గడ్డగా ప్రాచూర్యం పొందింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతానికి చెందిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు పార్లమెంట్ సభ్యడిగా, సూర్యాపేట ద్విసభ్య నియోజకవర్గంలో ధర్మభిక్షం, ఉప్పల మల్సూర్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు. 1957లో భీమిరెడ్డి నర్సింహారెడ్డితో పాటు ఉప్పల మల్సూర్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
మొదట తాలూకాగా..
బ్రిటీష్ వారి పాలనలో హైదరాబాద్ నుంచి జగ్గయ్యపేటకు రాకపోకలు సాగించే సందర్భంలో సూర్యాపేట మీదుగా దండుబాట పడింది. ఈ సందర్భంలో భానుపురం ఈ రెండు ప్రాంతాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. నిజాం పాలనలో 1902లో నల్లగొండ సుభా(జిల్లా)గా ఏర్పడిన సమయంలో సూర్యాపేట తాలూకా అయ్యింది. అప్పటి భానుపురం కాలక్రమంలో భానుపురిగా, సూర్యాపేటగా మార్పు చెందింది. 1952లో మొదటిసారి 16 వార్డులతో గ్రేడ్ –3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 1969లో 20 వార్డులతో గ్రేడ్–2గా 1996లో 28 వార్డులతో గ్రేడ్ –1 మున్సిపాలిటీగా మారింది. ప్రస్తుతం 9 గ్రామాల విలీనంతో 48 వార్డులకు అప్‌గ్రేడ్ అయ్యింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలో 1,06,805 మంది జనాభా ఉన్నారు.
ఎనిమిది మంది చైర్మన్లు..
1952లో ఏర్పడి సూర్యాపేట మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఎనిమిది మంది చైర్మన్లు పనిచేశారు. 1987, 1995, 2000లో చైర్మన్ స్థానానికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. పదవీలో ఉండగానే వెదిరె నర్సింహారెడ్డి, కాచర్ల లక్ష్మీకాంతారావులు మృతి చెందారు. 1987లో లక్ష్మీకాంతారావు చైర్మన్‌గా కొనసాగుతూ మృతి చెందడంతో వైస్ చైర్మన్ కట్కూరి గన్నారెడ్డి ఏడాదికి పైగా ఇన్‌చార్జి చైర్మన్‌గా పని చేశారు. పేట మున్సిపల్ చైర్‌పర్సన్లుగా ఇద్దరు మహిళలు గండూరి ప్రవళ్లిక, పెరుమాళ్ల అన్నపూర్ణ పని చేశారు. కర్పూరం శ్రీనివాసస్వామి మూడు సార్లు, మీలా సత్యనారాయణ రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్లుగా పని చేశారు. గత మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట జనరల్‌గా రిజర్వ్ అయినప్పటికీ ఎస్సీ మహిళ అయిన పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్‌పర్సన్‌గా చేయడం చర్చనీయాంశమైంది.
ముఖచిత్రం
ప్రస్తుత ఓటర్ల సంఖ్య
పురుషులు : 52,170
మహిళలు : 56,664
ఇతరులు : 14
మొత్తం : 1,08,848
చైర్మన్లకు తప్పని వర్గపోరు
పేట మున్సిపాలిటీ పాలకవర్గంలో ఎప్పుడూ వర్గపోరు తప్పడం లేదు. 2008లో మున్సిపల్ చైర్మన్‌గా మీలా సత్యనారాయణ, వైస్ చైర్మన్‌గా బీరవోలు రవీందర్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీకే చెందిన కౌన్సిలర్లు వారిద్దరిపై అవి శ్వాసం పెట్టారు. అప్పటి ఎంపీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండూరి ప్రవళిక, టీడీపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె టీఆర్‌ఎస్‌తో చేరారు. ఏడాదిన్నర తర్వాత సొంత పార్టీ కౌన్సిలర్లు ఆమైపె తిరుగుబాటు చేశారు. అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి జోక్యంతో వివాదం సద్దు మణిగింది. 2020లో టీఆర్‌ఎస్‌కు చెందిన పెరుమాళ్ల అన్నపూర్ణ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఓటింగ్ సమయంలో వారిలో ఒక్కరు సమావేశానికి రాకపోవడంతో సంఖ్యాబలం లేక వీగిపోయింది.
ఫ కాలక్రమేణా సూర్యాపేటగా నామకరణం
ఫ 124 ఏళ్ల క్రితమే తాలూకా కేంద్రం
ఫ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో
ఈ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు
ఫ 1952లో మున్సిపాలిటీగా ఆవిర్భావం
ఫ మున్సిపల్ చైర్మన్‌లుగా పనిచేసిన హేమాహేమీలు
క్ర.సం చైర్మన్ పేరు సంవత్సరం పార్టీ
1 కర్పూరం శ్రీనివాసస్వామి 1952–54 పీడీఎఫ్
2 కర్పూరం శ్రీనివాసస్వామి 1958–62 పీడీఎఫ్
3 కర్పూరం శ్రీనివాసస్వామి 1962–67 కాంగ్రెస్
4 వెదిరె నర్సింహారెడ్డి 1967–73 కాంగ్రెస్
5 ప్రత్యేకాధికారి పాలన 1973 – 81 ––
6 గుర్రం విద్యాసాగర్‌రెడ్డి 1981–1987 కాంగ్రెస్
7 రాచర్ల లక్ష్మీకాంతారావు 1987–90 టీడీపీ
8 మీలా సత్యనారాయణ 1990–92 (ఉప ఎన్నిక) కాంగ్రెస్
9 ప్రత్యేక పాలన 1992 –95 ––
10 జుట్టుకొండ సత్యనారాయణ 1995–2000 టీడీపీ
11 జుట్టుకొండ సత్యనారాయణ 2000–05 బీజేపీ
12 మీలా సత్యనారాయణ 2005–10 కాంగ్రెస్
13 ప్రత్యేక పాలన 2010–14 ––
14 గండూరి ప్రవళిక 2014–19 టీఆర్‌ఎస్
15 పెరుమాళ్ల అన్నపూర్ణ 2020–25 టీఆర్‌ఎస్


