పాఠశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థి
నల్లగొండ : పాఠశాల భవనంపై నుంచి విద్యార్థి దూకడంతో అతడి రెండు కాళ్లు విరిగాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కాలేజీ భవన సముదాయంలో నిర్వహిస్తున్న తిప్పర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరగగా.. అధికారులు మాత్రం గోప్యంగా ఉంచారు. వివరాలు.. గుర్రంపోడు మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన వేముల వెంకన్న, పద్మ దంపతుల కుమారుడు శివసాయి తిప్పర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తమ కుమారుడు శివసాయి పాఠశాల భవనంపై నుంచి దూకాడని, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించామని పాఠశాల నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లినట్లు విద్యార్థి తల్లి పద్మ పేర్కొంది. ఇప్పటి వరకు తమ కుమారుడికి ఆపరేషన్ చేయలేదని, ఎందుకు దూకావని శివసాయిని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడని ఆమె తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించాలంటే అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం సరిగ్గా చేయడం లేదని, తన కుమారుడికి మంచి వైద్యం అందించి బాగుచేయాలని ఆమె కోరుతోంది.
గతంలో పారిపోయాడు : ప్రిన్సిపాల్
అయితే శివసాయి గతంలో ఒకసారి పాఠశాల నుంచి పారిపోయాడని, ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతడిని ఇంటికి తీసుకెళ్లారని ప్రిన్సిపాల్ సునీత వివరించింది. ఆ తర్వాత శివసాయి తల్లిదండ్రులు బతిమిలాడితే తిరిగి అతడికి పాఠశాలలోకి తీసుకున్నామని తెలిపింది. శివసాయి మళ్లీ పారిపోతే టీసీ ఇవ్వాలని అతడి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని పేర్కొంది. అయితే ఈ నెల 30న ప్రార్థన అయిన తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో శివసాయి భవనంపై నుంచి దూకినట్లు ప్రిన్సిపాల్ తెలిపింది. విషయం తెలియగానే కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి కారులో పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, శివసాయికి పాఠశాలలో ఉండటం ఇష్టం లేకనే భవనం పైనుంచి దూకినట్లు ప్రిన్సిపాల్ వివరించింది.
విద్యార్థి కుడి కాలు విరిగింది : సూపరింటెండెంట్
విద్యార్థి కుడి కాలు మోకాలి కింద విరగడంతో పాటు పాదంలో ఎముకలు విరిగాయని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహ తెలిపారు. నడుంలోనూ ఫ్యాక్చర్ అయిందని, వాపులు ఉండటంతో ఆపరేషన్ చేయలేకపోయామని, వాపులు తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
రెండు కాళ్లు విరగడంతో ఆస్పత్రిలో చేర్చిన పాఠశాల నిర్వాహకులు
గోప్యంగా ఉంచిన అధికారులు


