తాత బాటలో మనవడు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మసనం సంగీతాశ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ చౌటుప్పల్ మొట్టమొదటి సర్పంచ్ అయిన మసనం లక్ష్మయ్య మనవడు కావడం విశేషం. తాత బాటలోనే రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్న శ్రీనివాస్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తాత లక్ష్మయ్య విగ్రహానికి ఆదివారం నివాళులర్పించి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభించారు.
మున్సిపల్ కమిషనర్‌కే
చెక్ పవర్
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీల్లో సర్పంచ్. ఉప సర్పంచ్‌కు కలిపి చెక్ పవర్ ఉంటుంది. కానీ మున్సిపాలిటీలో మాత్రం అందుకు భిన్నంగా మున్సిపల్ కమిషనర్‌కు మాత్రమే చెక్‌పవర్ ఉంటుంది. మున్సిపాలిటీల్లో వివిధ పనుల కోసం లక్షల రూపాయలతో సామగ్రి కొనుగోలు, అభివృద్ధి పనులు వంటివి చేపడితే సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి బిల్ చేసి మున్సిపల్ కమిషనర్‌కు సమర్పిస్తారు. వాటి వివరాలను కమిషనర్ సరి చూసుకొని ధ్రువీకరించి పాలకవర్గ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఫైల్‌పై మున్సిపల్ చైర్మన్ సంతకం తీసుకోవాలి. అనంతరం ఆయా వివరాలను క్యాష్‌బుక్‌లో నమోదయ్యాక కమిషనర్ చెక్ జారీ చేస్తారు. చెక్ వివరాలు.. ఏ వ్యక్తికి ఎందుకు ఇచ్చారో వంటివి క్యాష్‌బుక్‌లో నమోదు చేసే బాధ్యత మున్సిపల్ అకౌంటెంట్‌ది. ఒకవేళ పాలకవర్గం గడువు ముగిస్తే ప్రత్యేకాధికారి అనుమతి తీసుకుని చెక్కులు జారీ చేస్తారు. ఇందులో ఏ నిబంధన ఉల్లంఘించినా నేరంగానే పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లులు, తప్పుడు సమాచారంతో చెక్కులు జారీచేస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టి నగదును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.


