గంజాయి ముఠా అరెస్ట్
మిర్యాలగూడ : గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను వాడపల్లి పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం మధుబని జిల్లాకు చెందిన ఇంద్రజిత్‌కుమార్, ప్రిన్సియాదవ్, కన్నయ్యకుమార్ పాశ్వాన్, కమలేష్‌యాదవ్, పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లాకు చెందిన గన్‌మిత్‌సింగ్ దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూలీలుగా పనిచేస్తూ వీర్లపాలెం గ్రామంలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి ఈ ఐదుగురు వీర్లపాలెం గ్రామ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్ పర్యవేక్షణలో వాడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు ఐదుగురు బిహార్‌కు చెందిన అనిల్‌యాదవ్, ముఖేష్‌యాదవ్, రోషన్‌యాదవ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రైలులో వీర్లపాలెంకు తీసుకొచ్చి స్థానికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తోటి కార్మికులతో కలిసి రెండు గ్రాముల చొప్పున గంజాయి ప్యాకెట్లను తయారు చేసి రూ.100కు విక్రయిస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారు. వారి నుంచి రూ.1.25లక్షల విలువైన ఐదు కిలోల గంజాయి, ప్యాకింగ్‌కు ఉపయోగించే పాలిథిన్ కవర్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అనిల్‌యాదవ్, ముఖేష్‌యాదవ్, రోషన్‌యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీఐ పీఎన్‌డీ ప్రసాద్, వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది వెంకటేష్, మధు, సైదులు, పూజ, సంతోష్‌రెడ్డి, చంద్రశేఖర్, యాదగిరిని డీఎస్పీ అభినందించారు.
ఐదు కేజీల గంజాయి స్వాదీనం


