తల్లి మృతి.. అనాథలైన చిన్నారులు
మునగాల : తల్లి మృతి చెందడంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. మునగాలకు చెందిన కోటయ్య కుమార్తె ఎల్లమ్మ (28)కు నడిగూడేనికి చెందిన కిరణ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలను ఎల్లమ్మ పోషిస్తోంది. గత మూడు నెలలుగా శ్యాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తెలు అనన్య(6), హనీ(3), కుమారుడు అరవింద్(5) అనాథలయ్యారు. ఎస్సీ కాలనీకి చెందిన పలువురు యువకులు విరాళాలు సేకరించి శుక్రవారం ఎల్లమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్ల మ్మ తల్లి గతంలోనే మృతిచెందగా తండ్రి కోటయ్య కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నారులను తండ్రి చేరదీయకుంటే వారిని అనాథాశ్రమంలో చేర్పించే ఆలోచనలో కాలనీవాసులు ఉన్నారు. చిన్నారుల భవితవ్యానికి ఎవరైన సాయం అందిస్తే తాను పోషిస్తానని తాత కోటయ్య పేర్కొన్నాడు.


