మిర్యాలగూడ కాంగ్రెస్‌లో అలకలు
మిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ కాంగ్రెస్‌లో నేతలు అలకబూనినట్లు తెలిసింది. ఒకవైపు వార్డుల రిజర్వేషన్లు సక్రమంగా లేదని ఇప్పటికే ఆవేదన చెందుతున్న ఆ పార్టీ నాయకులకు టికెట్లు కేటాయించే విషయంలోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారని సమాచారం. వార్డుల రిజర్వేషన్ తారుమారు చేశారనే ఆరోపణలతో రిజర్వేషన్ ప్రకటన నుంచి కాంగ్రెస్ పార్టీలో రచ్చ సాగుతోంది. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై శుక్రవారం గడువు ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో 12 మంది మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, మాజీ చైర్మన్ మెరుగు రోశయ్యతోపాటు పీఏసీఎస్ మాజీ చైర్మన్ బంటు శ్రీనివాస్, ముఖ్య నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. మున్సిపల్ ఎన్నికల సమయంలో తిరునగరు భార్గవ్ వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని పైకి చెప్పినప్పటికీ.. కౌన్సిలర్ టికెట్లు కేటాయించే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఆ వర్గానికి సంబంధించిన వారు ఆందోళనకు గురవుతున్నారు. నామినేషన్ల గడువు ముగిసేంతవరకు భార్గవ్ వర్గానికి సంబంధించి వారికి తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో.. వారు అలకబూనారని సమాచారం. ఈనెల 31న నామినేషన్ స్క్రూట్నీ అనంతరం ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3వరకు ఉండడంతో ఈలోపు తమకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు మాజీ చైర్మన్ భార్గవ్ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. అదే జరిగితే.. పార్టీకి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు.
ఫ రాజీనామా యోచనలో పలువురు నేతలు!


