పాలకుల విధానాలతో సంక్షోభంలో వ్యవసాయం
మిర్యాలగూడ అర్బన్ : పాలకుల విధానాల వల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు, పంటలకు తగిన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస బాట పట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతులకు రుణ పరిమితి చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్కుల మట్టయ్య, హంసారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కుసుమ బాబురావు, గుండెబోయిన చంద్రయ్య, మల్లికార్జున్, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, అంజయ్య, సోమయ్య, మోహన్, కిషన్, సరసింహారెడ్డి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్


