ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
చౌటుప్పల్ : భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెలకు వద్దకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. గుండెపోటుతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. వివరాలు.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన చీర్క నర్సిరెడ్డి(65)కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కుమారుడు గతంలోనే మృతిచెందగా.. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నర్సిరెడ్డి ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నర్సిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలు వస్తుండడంతో ఆస్పత్రిలో చూపించుకునేందుకు కుమార్తె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం భార్య లక్ష్మమ్మతో కలిసి ఆటోలో చౌటుప్పల్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో బస్సు ఎక్కారు. బస్సు బస్టాండ్ నుంచి బయల్దేరి కొద్దిగా ముందుకు వెళ్లగానే తనకు దమ్ము వస్తుందంటూ నర్సిరెడ్డి భార్యకు చెప్పాడు. అంతలోనే సీట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ల ఎదుటే భర్త చనిపోవడంతో నర్సిరెడ్డి భార్య లక్ష్మమ్మ బోరున విలపించింది.
ఫ హైదరాబాద్‌లో కుమార్తె వద్దకు
వెళ్తుండగా భార్య కళ్లెదుటే
ప్రాణాలొదిలిన వృద్ధుడు


