విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలి
ఫ ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: డిగ్రీ విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు హాజరు 75శాతం ఉండేలా ప్రతి కళాశాల బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వై. ప్రశాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జయంతి, సమ్రీన్ కాజ్మీ , సరిత పాల్గొన్నారు.
బంగారం చోరీ కేసులో
ముగ్గురు మహిళల అరెస్టు
సూర్యాపేటటౌన్ : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి మెడలోని బంగారు నల్లపూసల గొలుసును అపహరించిన ముగ్గురు మహిళలను సూర్యాపేట రూరల్ పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మెంతమైన బుచ్చమ్మ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ నెల 19న బుచ్చమ్మ ఇంట్లో ఉండగా.. ముగ్గురు మహిళలు వచ్చి ఆమె మెడలోని బంగారు నల్లపూసల గొలుసును లాక్కోని వెళ్లారు. బాధితురాలి కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట మండలం రామ్లతండాకు చెందిన వాంకుడోతు పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ చోరీ చేసినట్లు గుర్తించి వారిని పట్టుకుని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్‌ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజాపేట : ఇంట్లో జారిపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామానికి మాలోతు నాను(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న నాను ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ మైసయ్య తెలిపారు.
విద్యలో నాణ్యత పెంపునకు కృషిచేయాలి


