హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక..
ఫ ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య
డిండి : సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన 10వ తరగతి విద్యార్థి తిరిగి హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన డిండి మండల పరిధిలోని కామేపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి గ్రామానికి చెందిన జఠమోని ఆంజనేయులు, విజయ దంపతుల కుమారుడు శివ(14) హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగకు కామేపల్లికి వచ్చిన శివ తిరిగి హాస్టల్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శివ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గంజాయి పట్టివేత
ఫ ఐదుగురిపై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలో గంజాయి పంచుకుంటున్న ఐదుగురిని బుధవారం స్థానిక పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణానికి చెందిన ఇంజమూరి యశ్వంత్, ఇంజమూరి సాయివర్మ, మచ్చ పవన్, కొల్లోజు రోహిత్, ఒగ్గు నాగరాజు ముఠాగా ఏర్పడి ఈ నెల 18న రెండు కేజీల గంజాయిని రూ.20వేలకు బిహార్ రాష్ట్రానికి చెందిన హుస్సేన్ వద్ద కొనుగోలు చేశారు. ఆ గంజాయిని నేరేడుచర్లలోని హుజూర్‌నగర్ రోడ్డులో గల పాత అట్టాల ఫ్యాక్టరీ వద్ద అందరూ కలిసి పంచుకుంటుండగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి గంజాయితో పాటు ఐదు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


