బత్తాయి మార్కెట్.. అలంకారప్రాయం!
రైతులు రావడం లేదు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌బీసీలో నిర్మించిన బత్తాయి మార్కెట్ క్రయవిక్రయాలు లేక అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. రూ.కోటి 78 లక్షలు వెచ్చించి నిర్మించిన మార్కెట్‌లో విశాలమైన రేకుల షెడ్డుతో పాటు వేబ్రిడ్జ్ లైటింగ్ కాంపౌండ్ వాల్ నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కొనుగోళ్లు జరగకపోవడంతో రేకుల షెడ్డులో సీఎంఆర్ ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్న బత్తాయి మార్కెట్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.
2018లో మార్కెట్ ప్రారంభం
పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా బత్తాయి తోటలకు నిలయంగా ఉండేది. అప్పుడు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు బత్తాయి తోటలు సాగయ్యాయి. రైతులు బత్తాయిలు అమ్ముకోవడానికి దళారును ఆశ్రయించే పరిస్థితి ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టాలపాలు కావొద్దనే ఉద్దేశంతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017 మేలో 12 ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి 2018లో మార్కెట్‌ను ప్రారంభించారు. అప్పుడు 20 మంది వ్యాపారులు నల్లగొండ వ్యవసాయ మార్కెట్ నుంచి లైసెన్స్‌లు కూడా పొందారు.
మార్కెట్‌పై ఆసక్తి చూపని రైతులు..
జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న బత్తాయి తోటలు తెగుళ్ల కారణంగా చాలా వరకు చనిపోయాయి. దీంతో రైతులు బత్తాయి తోటలు నరికి వేసి వరి సాగుకు మొగ్గు చూపారు. ఏటేటా బత్తాయి తోటల విస్తీర్ణం తగ్గుతూ ప్రస్తుతం 50 వేల ఎకరాలలోపే ఉన్నాయి. బత్తాయి సాగు తగ్గిపోతుండటంతో పండించిన బత్తాయిలను మార్కెట్‌కు తీసుకొస్తే రవాణా భారం రైతులపై పడుతుంది. రైతులు తోటల వద్దనే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితులు ఉండటంతో రైతులు మార్కెట్‌కు రావడం లేదు. దీంతో వ్యాపారులు కూడా లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోలేదు.
బత్తాయి మార్కెట్లో కాయలు అమ్మడానికి రైతులు రావడం లేదు. తోటల వద్దనే బత్తాయిలు అమ్ముకుంటున్నారు. దీంతో వ్యాపారులు కూడా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదు.
– ఛాయాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి
ఫ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌బీసీలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
ఫ ప్రారంభించి ఎనిమిదేళ్లయినా క్రయవిక్రయాలు లేవు
బత్తాయి మార్కెట్.. అలంకారప్రాయం!


