బాలికా విద్యను ప్రోత్సహించాలి
నల్లగొండ : బాల్య వివాహాలను అరికట్టేందుకు బాలికల విద్యను ప్రోత్సహించడమే పరిష్కారమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ‘జాగ్రత్త’ పేరుతో బాల్య వివాహాల విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్ట విరుద్దం, నేరమన్నారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్‌ను దెబ్బతీయడమే కాకుండా, వారి ఆరోగ్యం, విద్య, హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. బాల్యవివాహాలు జరగకుండా ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమని, విద్యపై పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్యవివాహల నిర్మూలనకు రూపొందించిన ప్రచార రథం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మండలాల్లో తిరుగుతూ పాటలు, నినాదాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, సీడీపీఓ హరిత, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నాగరాజు, గణేష్, చింతకృష్ణ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


