రోడ్డు భద్రత.. ప్రతి పౌరుడి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. రోడ్డు భద్రత మాసోవ్సవాల్లో భాగంగా మంగళవారం నల్లగొండలోని పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ – అలైవ్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలో గతేడాది కాలంలో సుమారు 900 నుంచి 950 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. అందులో దాదాపు 360 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటిలో సుమారు 90 శాతం మంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని.. ప్రాణ రక్షణకు అత్యంత కీలకమైన సాధనమన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. అనంతరం ప్రమాదరహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శివారెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్‌రెడ్డి, రాము, మహాలక్ష్మయ్య, టూటౌన్ ఎస్‌ఐ సైదులు, రూరల్ ఎస్‌ఐ సైదాబాబు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


