అప్పుడు ఆయన.. ఇప్పుడు ఆమె!
న్యూస్‌రీల్
పలువురి ఆశలు గల్లంతు
మున్సిపల్ బరిలో భార్యలను నిలిపే యోచనలో నేతలు
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
ఫ 18 మున్సిపాలిటీల్లో తొమ్మిదింట చైర్మన్లుగా అతివలకే అవకాశం
ఫ నీలగిరి కార్పొరేషన్‌లోనూ మహిళకే మేయర్ పీఠం
ఫ రొటేషన్‌లో హాలియా మినహా అన్నిచోట్లా మారిన రిజర్వేషన్
ఫ అత్యధిక వార్డుల్లో
పోటీ చేయనున్న మహిళలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ముఖ్యనేతల స్థానాల్లో మహిళలే ఎక్కువ మంది పోటీ పడనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారిపోవడంతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో మహిళలు పోటీ చేయనున్నారు. నల్లగొండ కార్పొరేషన్ సహా చాలా మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 18 మున్సిపాలిటీల్లో తొమ్మిది చోట్ల మహిళలే చైర్మన్ కానున్నారు. నీలగిరి కార్పొరేషన్‌లో కూడా మేయర్‌గా మహిళకే అవకాశం దక్కింది. దీంతో పట్టణాల్లో ముఖ్య నేతలు తమ సతీమణులను పోటీలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. హాలియా మున్సిపాలిటీ చైర్మన్ స్థానం రిజర్వేషన్లలో మారలేదు. గతంలో, ఇప్పుడు జనరల్‌గానే ఉంది. నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది.
పోటీపై మల్లగుల్లాలు
నల్లగొండ కార్పొరేషన్ మేయర్ పీఠం ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. గతంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 32వ వార్డు ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన సతీమణి చైతన్యరెడ్డిని నిలబెట్టి, మేయర్ పీఠం కోసం పోటీపడే అవకాశాలు ఉన్నాయి. మరో మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డికి చెందిన 17వ వార్డు కూడా ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన తన సతీమణినే నిలబెట్టే అవకాశం ఉంది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌కు చెందిన 47వ వార్డు మహిళకే రిజర్వ్ ఆయింది. దీంతో ఆయన అదే దిశగా ఆలోచిస్తున్నారు. బీజేపీ నేత పిల్లి రామరాజుయాదవ్‌దీ అదే పరిస్థితి.
మిర్యాలగూడ చైర్మన్ స్థానం గతంలో జనరల్ కాగా, ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మరోవైపు గతంలో చైర్మన్‌గా చేసిన తిరునగరు భార్గవ్ 36వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. మరోవైపు వైస్ చైర్మన్‌గా చేసిన కుర్ర కోటేశ్వర్‌రావు 21వ వార్డు కూడా బీసీ మహిళ అయింది. దీంతో వారు గందరగోళంలో పడ్డారు. వీరితోపాటు పలు ముఖ్యనేతలు కూడా ఎక్కడ పోటీ చేయాలోనని వెతుక్కునే పనిలో పడ్డారు.
నందికొండలో మున్సిపల్ చైర్మన్ గతంలో జనరల్ మహిళ కాగా, ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో అక్కడ చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరికి ఈసారి అవకాశం లేకుండా పోయింది.
దేవరకొండలో గతంలో చైర్మన్ స్థానం జనరల్ కాగా ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించారు. దీంతో అక్కడ చైర్మన్‌గా చేసిన ఆలంపల్లి నర్సింహకు అవకాశం లేకుండాపోయింది. ఆయన గతంలో గెలిచిన 16వ వార్డు కూడా ఎస్టీ జనరల్ కావడంతో ఆయన మరోవార్డుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వైస్ చైర్మన్‌గా చేసిన రహమత్ అలీది అదే పరిస్థితి.
చండూరు గతంలో బీసీ మహిళ కోటాలో తోకల చంద్రకళ చైర్‌పర్సన్ కాగా, ఈసారి అది జనరల్‌కు రిజర్వ్ అయింది.
చిట్యాల మున్సిపాలిటీ గతంలో జనరల్ కాగా, ప్రస్తుతం జనరల్ మహిళ అయ్యింది. గత చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి ప్రస్తుతం చైర్మన్ స్థానానికి పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. ఆయన వార్డు రిజర్వేషన్ కూడా మారిపోయింది.
మున్సిపల్ చైర్మన్‌గా గతంలో పనిచేసిన వారి ఆశలు ఈసారి గల్లంతయ్యాయి. తాము చైర్మన్ స్థానంలో కూర్చోవాలనుకున్నా రిజర్వేషన్లు మారిపోవడంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు కార్పొరేటర్, కౌన్సిలర్‌గా పోటీ చేయాలకున్నా వారి వార్డుల రిజర్వేషన్లు కూడా మారిపోయాయి. దీంతో వారిలో కొందరు పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు అవకాశం ఉన్న చోట తమ సతీమణులను బరిలో నిలిపేందుకు సిద్ధవుతున్నారు.
అప్పుడు ఆయన.. ఇప్పుడు ఆమె!


