మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం
నల్లగొండ టూటౌన్ : మహిళల ఆర్థికాబివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు చెక్కులను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటివరకు 265 కోట్ల మంది ఉచిత బస్సులో ప్రయాణం చేశారని చెప్పారు. రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని పేదలందరికీ ఏడాదిలోగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. అయిటిపాములలో రూ.50 లక్షలతో 50 మంది ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయించామని, దాని ద్వారా మహిళలు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ జూపూడి రమేష్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జయమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


