తప్పులు లేకుండా వార్డుల రిజర్వేషన్లు
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుకు జీవో ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం, పారదర్శకంగా అమలు చేయాలన్నారు. గత ఎన్నికల రిజర్వేషన్ డేటా, జనాభా గణాంకాలు, రొటేషన్ విధానం వంటి అంశాలను పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు.


