‘సర్’ మ్యాపింగ్ 69 శాతం
జిల్లాలో మూడు నెలల నుంచి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 15,30,737 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 40 సంవత్సరాలు పైబడిన వారు 7,53,027 మంది ఉండగా ఇప్పటి వరకు 5,48,237 మంది ఓటర్లకు సంబంధించి 2002 నాటి సర్ జాబితాలోని ఓటర్లు, 2025 నాటి ఓటర్ల జాబితాతో పోల్చి మ్యాపింగ్ చేస్తున్నారు. ఇది 73 శాతం పూర్తయింది. 40 ఏళ్ల లోపువారు 7,77,710 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,06,212 మంది మ్యాపింగ్ పూర్తయింది. అంటే 67 శాతం పూర్తయింది. మొత్తం 40 ఏళ్లు పైబడిన వారు, 40 ఏళ్ల లోపు వారి మ్యాపింగ్ ప్రక్రియ 10,54,449 మందికి (69 శాతం) పూర్తయింది.
నల్లగొండ : ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)కు సంబంధించి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో 69 శాతం పూర్తయింది. 2025 ఓటరు జాబితాను 2002 నాటి జాబితాతో సరి చూస్తున్నారు. సీరియల్ నంబర్ ఆధారంగా రెండు ఓటర్ల జాబితాలో ఎక్కడెక్కడ ఓట్లు కలిగి ఉన్న విషయంపై మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బీఎల్‌ఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇల్లిల్లూ తిరిగి రెండు జాబితాల్లో పేర్లను సరిచూస్తూ సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తున్నారు. 2026 సర్ ఓటరు జాబితా తయారుకు ఎన్నికల కమిషన్ మార్చిలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆలోగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం చేపట్టనుంది.
2002 జాబితాలో ఎవరున్నారని ఆరా..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడుతుంది. 2002లో ఉమ్మడి రాష్ట్రంలో సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం చేపట్టింది. అయితే తిరిగి 2026లో ఈ సర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంటే ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు 2002 సర్ ఓటర్ల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారో గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
2002 జాబితాలో ఓట్లు లేకపోతే..
ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు 2002 సర్ జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రుల పేర్లను ఆ జాబితాలో వెతికి మ్యాపింగ్ చేస్తున్నారు. ఇందులో ఏవైనా అనుమానాలు ఉంటే ఓటర్లు సంబందిత బీఎల్‌ఓలను ఫోన్ ద్వారా సంప్రదించి తెలుసుకోవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అందుకు సంబందించి ఓటర్లకు అనుమానాలుంటే వెబ్‌సైట్ https-://voters.eci.gov.in/-home/book AcallRequest ఆన్‌లైన్‌లో వెళ్లి ఎపిక్ నంబర్, పోన్ నంబర్‌ను నమోదు చేస్తే సంబంధిత బీఎల్‌ఓకు ఆ ఓటరు ఫోన్ నంబర్‌ను ఈసీ నేరుగా పంపిస్తుంది. దాంతో బీఎల్‌ఓ ఆ ఓటరుకు ఫోన్ చేస్తుంది. 2002 జాబితాలోని తమ ఓటరు పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ నంబర్ వివరాలను చెప్పి 2025 జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఫ జిల్లాలో మూడు నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక విస్తృత సవరణ
ఫ 2002 నాటి ఓటర్ల జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్
ఫ 2002 సర్ జాబితాలో ఓటు ఎక్కడుందని ఆరా
ఫ ఇల్లిల్లూ తిరిగి మ్యాపింగ్ చేస్తున్న బీఎల్‌ఓలు


