హైవేపై వాహనాల దారి మళ్లింపు
నల్లగొండ : సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీ నుంచి హైదరాబాద్‌కు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నందున్న ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని పేర్కొన్నారు.


