ఎద్దులతోనే ఎవుసం
ఫ యంత్రాలు లేకుండా సేంద్రియ ఎరువులతో సాగు
ఫ విభిన్న పంటలు సాగు చేస్తున్న అడ్డగూడూరు రైతు సురేష్
ఫ దేశీయ విత్తనాలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు
అడ్డగూడూరు : యంత్రాల వినియోగం లేకుండా ఎద్దులతో అరకదున్ని సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్నాడు అడ్డగూడూరుకు చెందిన యువ రైతు తుప్పతి సురేష్. డిగ్రీ వరకు చదువుకున్న ఈ రైతు వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఐదేళ్లుగా పాడి ఆవులు సాకుతూ దేశీయ వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. యూట్యూబ్‌లో ‘సురేష్ ఫార్మర్ చానల్’ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు.
విభిన్న పంటలు
అంతరించి పోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణంతోపాటు నీటి, భూసారాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో యువ రైతు సురేష్ ముందుకు సాగుతున్నాడు. పంటల సాగులో యంత్రాలు వచ్చాక పశువుల పెంపకం తగ్గిపోయింది. వీటివాడకాన్ని పునరుద్ధరించాలన్న తలంపుతో ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నాడు. ఈ రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాల్లో దేశీయఽ వరి విత్తనాలైన బురూపి, కుకర్, రత్నం చోడి, నారాయణ కామిణి పంటను పండిస్తున్నాడు. 30 గుంటల్లో కొర్రలు, 30 గుంటల విస్తీర్ణంలో సజ్జలు, 2 ఎకరాల్లో దేశవాళీ వేరుశనగ, 30 గుంటల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. పంటలను స్థానికంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. డ్రాగన్‌ఫ్రూట్‌ను మాత్రం స్థానిక మార్కెట్లతో పాటు ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తున్నాడు. వ్యవసాయంలో పాడి కూడా ప్రధానమైనదే. దీనికోసం రూ.2 లక్షలతో సాహివాలు జాతికి చెందిన రెండు ఆవులు, గిర్ జాతికి చెందిన ఒక ఆవు, ఒంగోలు జాతికి చెందిన ఒక ఆవు కొనుగోలు చేసి సాకుతున్నాడు. వాటి ద్వారా వచ్చే పేడ, మూత్రాన్ని పంటలకు సేంద్రియ ఎరువుగా వాడుతున్నాడు. వీటి నుంచి వచ్చే పాల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు. ఆవులకు కలిగిన లేగదూడలకు తిరుపతి, మంగ, గౌరి పేర్లు పెట్టి వాటిని తన బిడ్డలుగా భావిస్తూ సాకుతున్నాడు.


