అటవీ సంపద కొల్లగొట్టేందుకే మావోల హత్య
చౌటుప్పల్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అటవీ సంపదను కొల్లగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై హత్యాకాండ మొదలు పెట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. అడవులకు, గిరిజనులకు, ఆదివాసీలకు రక్షణగా ఉన్న మావోయిస్టులను లేకుండా చేయడం ద్వారా విస్తారమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం చౌటుప్పల్‌లో సీపీఎం మున్సిపల్ కమిటీ విస్త్రతస్థాయి సమావేశానికి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ చింతల భూపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని, పేదలను ఉపాధికి దూరం చేసేందుకే ఉపాధి హామీ పథకం పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పక్షాన పనిచేసే సీపీఎం అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


