గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
నల్లగొండ : గణతంత్ర దినోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో సాంస్క్రతిక కార్యక్రమాలు, వివిధ శాఖల అభివృద్ధి తెలిపే శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డుల జాబితాను ఈనెల 20వ తేదీలోగా పంపించాలన్నారు. 30 ప్రభుత్వ శాఖలు అద్దె భవనాల్లో ఉన్నట్లు గుర్తించామని, వాటిని ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేస్తామన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా రైతులను చైతన్యం చేయాలని, రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. పంటల మార్పిడి విధానం పై అవగాహన కల్పించి వ్యవసాయ యాంత్ర పరికరాలను రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ పూర్తయిన రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, నోడల్ అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను గుర్తించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్‌ను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో భాగంగా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 6 పాఠశాలలను నిర్మించేందుకు భూములను గుర్తించామని కలెక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పాఠశాల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన నాలుగు పాఠశాలల టెండర్లు పూర్తయ్యాయని వివరించారు.


