విద్యుత్ వినియోగదారులకు ‘భట్టి’ లేఖ
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి, వ్యవసాయ ఉచితవిద్యుత్ లబ్ధిదారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపింది. ఉచితంగా విద్యుత్ పొందుతున్న వినియోగదారుడి పేరున లేఖలు రాసి విద్యుత్ అధికారులతో అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో పరిధిలోని ఉచిత విద్యుత్ వినియోగదారులకు విద్యుత్‌శాఖ అధికారులు లేఖలు అందజేస్తున్నారు. ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది.. ఆ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవాలని లేఖలో సూచించింది. భవిష్యతులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తామని, సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపింది.
2,49,309 మంది గృహజ్యోతి లబ్ధిదారులు
జిల్లాలో ఉచిత విద్యుత్ పొందే వినియోగదారులు 2,49,309 మంది ఉన్నారు. ఇందులో నల్లగొండ డివిజన్ పరిధిలో 1,20,339, మిర్యాలగూడ డివిజన్‌లో 78,623, దేవరకొండ డివిజన్‌లో 50,347 మంది ఉన్నారు. వీరితోపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పొందుతున్న వారు జిల్లాలో 2,44,622 మంది ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం నుంచి వినియోగదారుడి పేరు, సర్వీస్ నెంబర్ ముద్రించి లేఖలు అందిస్తున్నారు. ఆ లేఖను విద్యుత్ సిబ్బంది, అధికారులు కలిసి వినియోగదారుల ఇంటికి వెళ్లి చదివి వినిపిస్తున్నారు.
ఫ గృహజ్యోతి, వ్యవసాయ విద్యుత్ వినయోగదారుల పేరున లేఖలు పంపిన డిప్యూటీ సీఎం
ఫ ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్న విద్యుత్‌శాఖ సిబ్బంది


