జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి (40) కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. పరీక్షంచిన వైద్యులు ఆమె రక్తహీనత, కడుపులో 6 నెలల గర్భంతో సమానమైన పరిమాణంలో గడ్డ(కణితి) ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ప్రొఫెసర్ డాక్టర్ స్వరూపారాణి బృందం డాక్టర్ విద్యాభార్గవి, డాక్టర్ నిఖిత, డాక్టర్ ప్రఖ్య, అనస్తియా బృందం డాక్టర్ నేహా, డాక్టర్ శ్వేత, నర్సింగ్ సిబ్బంది సుధాక, పద్మ, రఘు.. లక్ష్మికి శ్రస్త చికిత్స చేసి కిలోన్నర కణితితో కూడిన గర్భసంచిని తొలగించారని తెలిపారు. ప్రస్తుతం పేషంట్ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మారంటూ రైతు నిరసన
కొండమల్లేపల్లి : తనకు నకిలీ విత్తనాలు అమ్మారంటూ ఓ రైతు మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల మన గ్రోమోర్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశాడు. చింతపల్లి మండలంలోని వెంకటంపేటకు చెందిన ఓ రైతు 10 రోజుల క్రితం కొండమల్లేపల్లిలోని మన గ్రోమోర్ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసి తన పొలంలో నారు చల్లాడు. ఐదు రోజులు గడిచినా మొలకెత్తకపోవడంతో రైతు ఆందోళన చెంది సోమవారం మన గ్రోమోర్ వద్దకు వచ్చి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఓ జానకి రాములు అక్కడకు వచ్చి రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు వరి విత్తనాల బస్తాలు తిరిగి ఇప్పించడంతో రైతు నిరసన విరమించాడు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు రశీదు తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని కళాకారులు చేపట్టిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కొండకు దిగువన ఉన్న వైకుంఠద్వారం వద్ద ప్రత్యేక వేదికపై కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది.
జీజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స


