రైతు వేదికల నిర్వహణ భారం
నిధులు రాగానే జమ చేస్తాం
రైతు వేదికల నెలవారీ
ఖర్చులు రూ.లలో ఇలా..
నల్లగొండ అగ్రికల్చర్ : గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలు నిర్వహణ భారంగా మారింది. కానీ మూడు సంవత్సరాలుగా వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కావడం లేదు. నెలనెలా చేతి నుంచే డబ్బులను వెచ్చించాల్సి వస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 140 వేదికలకు గాను ఇప్పటి వరకు సుమారు రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో ఏఈఓలు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 140 రైతు వేదికలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా 140 రైతు వేదికలను నిర్మించింది. వారం వారం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణనిస్తు సీజన్‌లో పంటల వారీగా సాగులో మెళకువలను తెలియజేయాలనేది రైతు వేదికల లక్ష్యం. ఈ వేదికల నిర్వహణ బాధ్యతలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించింది. వేదికల నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.9 వేల చొప్పున నిధులను కూడా విడుదల చేసింది. ఆ నిధులతో వేదికను శుభ్రం చేయించడం, ఇతర కార్యక్రమాలు చేపట్టేవారు. ఆ 9 వేల రూపాయలు చాలక వ్యవసాయ విస్తరణ అధికారులకు అదనంగా చేతి నుంచి ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ఏఈఓలు చేతి నుంచి ఖర్చు పెడుతూ నిధులు వచ్చినప్పుడు తీసుకునేవారు.
ప్రతి వారం వీడియో కాన్పరెన్స్‌లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం జిల్లాలోని రైతు వేదికల ద్వారా వీడియో కాన్పరెన్స్‌లు నిర్వహిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు. వారికి ప్రతివారం స్నాక్స్, బిస్కెట్లు, టీ తదితర ఖర్చులకు నిధులు లేకపోవడంతో అదనంగా తామే భరించాల్సి వస్తోందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
రైతు వేదికల నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేయగానే వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాతాల్లో జమ చేస్తాం. నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.
– శ్రవణ్‌కుమార్, డీఏవో, నల్లగొండ
ఫ మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం
ఫ సుమారు రూ.3 కోట్లమేర పెండింగ్
ఫ ఏఈఓలపై తప్పని భారం
వివరం ఖర్చు.
పరిశుభ్రతకు 3,000
శిక్షణకు 2500
స్టేషనరీ 1000
కరెంట్ బిల్లు 1000
మరమ్మతులు 1000
తాగునీరు 500
మొత్తం 9,000


