పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిల్స్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్టడీ సర్కిల్‌లో ప్రవేశాలకు పోటీ పరీక్షలో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష హాల్ టికెట్లు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని.. పోటీ పరీక్ష ఫిబ్రవరి 8న ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుందని తెలిపారు. అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 20 నుంచి జూలై 19, 2026 శిక్షణలో కొనసాగుతారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 84650 35932, 96031 67257 ఫోన్ నంబర్లఅను సంప్రదించాలని సూచించారు.
పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీనే ప్రామాణికం
రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ అన్నారు. మండలంలోని మేళ్ల దుప్పలపల్లిలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తరహాలో ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా టీసీసీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో నిర్వహించిన వివిధ టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఉదయం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ లోయర్ అండ్ హైయర్ పరీక్షలకు 1,378 మందికి గాను 1,049 మంది హాజరయ్యారని, 329 మంది గైర్వాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 1,047 మంది అభ్యర్థులు హాజరు కాగా, 331 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.
ఏసీబీ దాడులపై
ముందే సమాచారం!
నల్లగొండ : అవినీతికి పాల్పడిన వారిని అరికట్టాల్సిన ఏసీబీ వారే ముందస్తు దాడులు జరుగుతున్నాయనే సమాచారం ఇచ్చి వారినుంచి డబ్బులు వసూలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ ఏసీబీలో పనిచేస్తున్న ఒక సీఐ, ఒక హోంగార్డు ఈ తతంగానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాంపల్లి, మఠంపల్లి, గరిడేపల్లిలో గతంలో పనిచేసిన ఎస్‌ఐలపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దానిపై ముందే వారికి మీపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటూ సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. మఠంపల్లి ఎస్‌ఐకి ఏసీబీ ట్రాప్ సమాచారం ముందే ఇచ్చి రూ.10 లక్షలకు సెటిల్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులే ముందే సమాచారం లీక్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం విస్మయం గొల్పుతోంది.


