మేయర్.. ఏ కేటగిరీకి?
రాష్ట్ర యూనిట్‌గానే రిజర్వేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్‌లో మేయర్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది.. ఎవరు మేయర్ అవుతారనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణాయక విధానాలపై రాజకీయ పార్టీల్లోనూ సర్వత్రా చర్చ జరుగుతోంది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అవతరించిన నేపథ్యంలో తొలి మేయర్‌గా ఎవరు కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతారనే చర్చ జరుగుతుంది. ఈలోగా వారం పది రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. దీంతో రిజర్వేషన్లు మారుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో నల్లగొండ కార్పొరేషన్‌కు తొలి మేయర్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
గతంలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా..
నల్లగొండ మున్సిపాలిటీకి 1995లో చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో బీజేపీ నుంచి బోయినపల్లి కృష్ణారెడ్డి చైర్మన్ అయ్యారు. ఆ తరువాత 2000లో బీసీ జనరల్ అయింది. అప్పుడు పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్ కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 32 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2005లో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ తిరిగి జనరల్ అయింది. అప్పుడు కూడా పుల్లెంల వెంకట నారాయణ గౌడ్‌కే చైర్మన్ పదవి దక్కింది. ఆ సమయంలో 36 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2014లో రిజర్వేషన్ జనరల్ మహిళకు అయింది. అయితే బీసీ మహిళ అయిన బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 40 వార్డులు ఉండేవి. ఆ తరువాత 2020లో ఓసీ జనరల్ అయింది. అప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మందడి సైదిరెడ్డి చైర్మన్ అయ్యారు. అప్పుడు 48 వార్డులు అయ్యాయి. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బుర్రి శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్ అయ్యారు.
రాజకీయ పార్టీల్లో చర్చ
మొదటిసారి కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రిజర్వేషన్ల మార్పు తప్పనిసరి అనే సంకేతాలు రావడంతో మొదట ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చ సాగుతోంది. మొన్నటి వరకు పాత రిజర్వేషన్లు ఉంటాయని అంతా భావించారు. తాజాగా రిజర్వేషన్లు మారుతాయనే అంశం స్పష్టం కావడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మొదటిసారి మేయర్ రిజర్వేషన్ ఎవర్ని వరించనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ
ఫ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే విధానంపైనే సర్వత్రా చర్చ
ఫ రాష్ట్ర స్థాయిలోనే ఖరారు
చేయనున్న సర్కారు
ఫ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఆసక్తి
ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ కాాకుండా 9 కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కార్పొరేషన్ మేయర్‌లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. డివిజన్లు, వార్డులు మాత్రం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలోనే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అయితే నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది. దీంతో రాష్ట్ర యూనిట్ రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో ఈ రిజర్వేషన్ మారనుంది. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయంపైనే నల్లగొండ మేయర్ రిజర్వేషన్ జరగనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. మేయర్‌గా మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నందున మొదట జనరల్‌కు అవకాశం ఇస్తారా.. లేక బీసీలకా, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం దక్కుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది.


