
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 45 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,05,696 వచ్చి నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీస్వామి సన్నిధిలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పూజలు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.
సంప్రదాయ దుస్తుల్లో విదేశీయులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఫ్రాన్స్ దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీస్వామి వారి ఆలయ నిర్మాణ శైలిని ఫ్రాన్స్ దేశస్తులకు వివరించారు. హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు.

యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ