
నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8.15 గంటలకు నల్లగొండకు చేరుకుని రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.
ప్రశాంతంగా టీటీసీ పరీక్షలు
నల్లగొండ : నల్లగొండలో ఆదివారం నిర్వహించిన టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ మహ్మద్ యూసుపుద్దీన్, కోర్సు కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాసు తెలిపారు. దేవరకొండరోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టైలరింగ్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 199 మంది, సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో నిర్వహించిన డ్రాయింగ్ పరీక్షకు 250 మంది హాజరైనట్లు వెల్లడించారు.
బుద్ధవనాన్ని సందర్శించిన నటి యమున
నాగార్జునసాగర్ : సినీనటి యమున ఆదివారం బుద్ధవనాన్ని సందర్శించారు. పది రోజులుగా నాగార్జున విపస్యన ధ్యాన కేంద్రంలో జరిగే విపస్యన కోర్సుకు హాజరయ్యారు. కోర్సు పూర్తికావడంతో బుద్ధవనాన్ని సందర్శించారు. మహా స్థూపంలోని పంచముఖ బుద్ధుడి వద్ద జ్యోతి వెలిగించారు. నిర్వాహకులు రవిచంద్ర ఆమెను పంచశీల కండువాతో సత్కరించారు. అనంతరం గైడ్ సత్యనారాయణ మహాస్థూపం, ధ్యానవనం, జాతకపార్కు విశేషాలను వారికి వివరించారు. సమావేశ మందిరంలో బుద్ధవనం లఘు చిత్రాన్ని వీక్షించారు.
కేంద్ర పథకాలపై
ఇంటింటి ప్రచారం
రామగిరి (నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఆదివారం మండలంలోని వెలుగుపల్లి పోలింగ్ బూత్‌లో ఆ పార్టీ స్థానిక ఎన్నికల జిల్లా ప్రభారి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. మహాసంపర్క్ అభియాన్‌లో భాగంగా ఇంటింటికి తిరిగి కేంద్ర పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, పోతేపాక లింగస్వామి, బోగరి అనిల్‌కుమార్, బాకి నర్సింహ, సురుకంటి వెంకట్‌రెడ్డి, చింతపల్లి వెంకన్న, పోతెపాక శంకర్, కొప్పోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సస్పెన్షన్
పెన్‌పహాడ్ : భూ తగాదాలో ఇద్దరిపై దాడి చేసిన హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఆదివారం పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన శానం వెంకటేశ్వర్లు కుమారులు శానం లక్ష్మణ్‌రావు, నాగేంద్రబాబు అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 3న పెన్‌పహాడ్ మండలంలోని లింగాల గ్రామ శివారులో గల వ్యవసాయ భూమి విషయంలో శానం రామలింగయ్య, ఆయన కుమారుడు భరత్‌పై సైకిల్ చైన్లు, గొడ్డలితో హెడ్‌కానిస్టేబుళ్లు దాడిచేసి గాయపరిచారు. ఈ విషయమై బాధితుడు రామలింగయ్య పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్‌ఐ గోపికృష్ణ నివేదికను ఎస్పీకి అందజేశారు. ఎస్పీ ఆ నివేదికను 12వ బెటాలియన్ కమాండెంట్‌కు పంపారు. దీంతో దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుళ్లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు 12వ బెటాలియన్ కమాండెంట్ తెలిపారని డీఎస్పీ వివరించారు.
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం, పరిసరాలు సందడిగా మారాయి. వేకుజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తును అభిషేకం, సహస్రనామార్చనలతో కొలిచారు. సా యంత్రం వెండిజోడు సేవను ఆలయంలో భక్తు ల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామికి శయనోత్సవం నిర్వహించి ద్వారబంధనం చేశారు.