
బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ జాబితాలో ముస్లింలను కలిపారనే నెపంతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ వైఖరి మార్చుకోకపోతే వారి పర్యటనలను అడ్డుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల రెండో వారంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో చర్చించడానికి బీజేపీ నాయకులు ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం , సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎక్కడైనా సరే అని ఆయన ఛాలెంజ్ చేశారు. అవసరమైతే హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చకు కూడా సిద్ధమే అన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి మోదీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓసీ అయి కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాసోజు విశ్వనాథం, నేలపట్ల సత్యనారాయణ, నాయకులు చొల్లేటి రమేష్, గోపాలకృష్ణ, ఆదినారాయణ, కేసబోయిన శంకర్, నల్ల మధు యాదవ్, లాలయ్య, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్