
కాల్వకట్ట తవ్వేస్తున్నారు!
ఫ రైల్వే పనుల కోసం కాల్వ మట్టి
తరలింపు
ఫ పట్టించుకోని అధికారులు
ఫ కట్టలు బలహీన పడే ప్రమాదం
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ తవ్విన సమయంలో కాల్వ తవ్వకాల మట్టిని కాల్వ పటిష్టత కోసం ఇరువైపులా నింపి ఉంచారు. ఆ మట్టిని ఇప్పుడు మిర్యాలగూడ మండలంలో రైల్వే పనుల కోసం అక్రమంగా తవ్వుతున్నారు. రోజుకు లారీల కొద్దీ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. దీని కారణంగా కాల్వ కట్ట బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ఎడమకాల్వకు నీటిని విడుదల చేయడం వల్ల కాల్వ కట్ట బలహీనపడి గండి పడే ప్రమాదం కూడా ఉంది.
టిప్పర్లతో తరలింపు
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని బీబీనగర్– నల్లపాడు, కుక్కడం– విష్ణుపురం వరకు 55 కిలోమీటర్ల మేర రెండవ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా రైల్వే లైన్‌కు కింది భాగాన అవసరమైన మట్టిని సదరు కాంట్రాక్టర్ కొనుగోలు చేసి తరలించాల్సి ఉంది. కానీ మిర్యాలగూడ మండలంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాటర్ ట్యాంక్ తండా, మైసమ్మకుంటతండా, ఐలాపురం, చిల్లాపురం, నందిపాడు శివారులో ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లలో నింపి పగలు రాత్రి తేడా లేకుండా వందల టిప్పర్ల మట్టి తరలిస్తున్నారు. కోట్లు విలువల చేసే మట్టి తరలిపోతున్నా ఎన్‌ఎస్పీ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
రైల్వే పనులకు గాను ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట మట్టిని తరలించే విషయం మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. కాల్వ కట్టల మట్టిని తరలించే అధికారం ఎవరికీ లేదు. మేము కూడా ఎవరికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై విచారించి తక్షణమే చర్యలు తీసుకుంటాం.
– వెంకటయ్య, ఎన్‌ఎస్పీ ఈఈ