
హైవే అధ్వానం
చిట్యాల, నార్కట్‌పల్లి : హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది. నల్లగొడ జిల్లా చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల పరిధిలో ఈ హైవేపై గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల రెండు మీటర్ల పొడవు మేర రోడ్డు పొరలు లేచిపోయాయి. ముఖ్యంగా చిట్యాల పట్టణ శివారులో, పెద్దకాపర్తి గ్రామ శివారులో, నార్కట్‌పల్లి ఫ్లై ఓవర్ వద్ద ఈ రోడ్డు ఎక్కువగా దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా ఈ రోడ్డుపై ఫీటు మేర అక్కడక్కడ గుంతలు పడ్డాయి. వీటి మీదుగా ప్రయాణించే ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. జాతీయ రహదారిపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో జీఎంఆర్ సంస్థ రోడ్డు నిర్వహణ బాధ్యత చూసుకుంది. ప్రస్తుతం టోల్‌గేట్ నిర్వహిస్తున్న నేషనల్ హైవే అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతోనే రోడ్డు ధ్వంసమవుతోంది. సంబంధిత అధికారులు పర్యవేక్షించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.