
వర్షపాతం సాధారణమే!
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాపై వరుణుడు కరుణచూప లేదు. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షమే కురిసింది. ఇప్పటి వరకు 196.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా 188.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత వారం అల్పపీడనం కారణంగా వర్షం కురిసినప్పటికీ చిరుజల్లులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడా చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. ఆ వర్షంతో కేవలం మెట్టపంటలైన కంది, పత్తికి కొంత మేలు చేకూరింది. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం మర్రిగూడ మండలంలో మాత్రమే అత్యధిక వర్షం కురిసింది. ఆ మండలంలో 158.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 262.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
9 మండలాల్లో అధిక వర్షం
జిల్లాలో ఇప్పటి వరకు 9 మండలాలల్లో అధిక వర్షం కురిసింది. చింతపల్లి, అడవిదేవులపల్లి, పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, గుడిపల్లి మండలాల్లో సాధారణ వర్షం కంటే అధిక వర్షం కురిసింది. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, నకిరేకల్, మునుగోడు, గుర్రంపోడు, నిడమనూరు, దామరచర్ల, తిరుమలగిరిసాగర్, నేరెడుగొమ్ము, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మిగిలిన 11 మండలాలైన కేతేపల్లి, తిప్పర్తి, నల్ల గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, అనుముల హాలియా, త్రిపురారం, మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో సాధారణం కంటే తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదైంది.
5,32,641 ఎకరాల్లో పత్తిసాగు
సీజన్ మొదట్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో సాగు అంచనాలు తగ్గాయి. ఈ సీజన్‌లో పత్తి సాగు అంచనా 6,25,276 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 5,32,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వరినాట్లు కూడా ఊపందుకోలేదు. వరిసాగు అంచనా 5,45,620 ఎకరాలు కాగా.. అనుకూలమైన వర్షాలు కురవని కారణంగా ఇప్పటి వరకు కేవలం 1,25,284 ఎకరాల్లోనే రైతులు నాట్లు వేశారు. ఇటీవల మెట్ట పంటలకు అనుకూలమైన వర్షం కురవడంతో పత్తి, కంది పంటలు జీవం పోసుకున్నాయి.
వరి సాగు ఊపందుకుంటుంది
నాగార్జునసాగర్ ఆయకట్టు, వరదకాలువ, ఏఎమ్మార్పీ కాలువల పరిధిలో సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు కింద వరినాట్లు ఊపందుకుంటాయి. ఆగస్టు చివరి వరకు వరినాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు సరిపడా నార్లు సిద్ధంగా ఉన్నాయి.
– శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
కురవాల్సింది 196.3 మి.మీ, కురిసింది 188.7 మి.మీ
ఫ ఇప్పటికీ 11 మండలాల్లో
లోటు వర్షపాతం
ఫ మర్రిగూడ మండలంలోనే
అత్యధిక వర్షం
ఫ సీజన్ మొదట్లో వర్షాభావంతో
అంచనాలకు తగ్గిన పత్తిసాగు

వర్షపాతం సాధారణమే!