
నవనీత.. సాగులో ఘనత
రెండు ఎకరాల విస్తీర్ణంలో అద్భుతాలు
● పాలీహౌస్‌లలో సేంద్రియ పద్ధతుల్లో కీర సాగు
● కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు,
మరో పది మందికి ఉపాధి
● ఆదర్శంగా నిలుస్తున్న పంగాల నవనీత
తుర్కపల్లి : ఆమె సాధారణ గృహిణి. వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేద్యంలోకి అడుగుపెట్టింది. పాలిహౌస్‌లు ఏర్పాటు చేసి ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట పండించి.. ఇప్పుడు కీరదోస సాగు చేస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో మంచి దిగుబడి సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటునందించడమే కాకుండా మరో పది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. పంగాల నవనీత.
ఎకరాకు రూ.3లక్షల నుంచి రూ.4లక్షలు
ఏడాదికి రెండు విడతల్లో కీరదోస పండిస్తున్నారు. పంట వేసిన అనంతరం 25 రోజుల తరువాత కాత మొదలవుతుంది. ప్రతి రెండు, మూడు రోజులకోమారు దిగుబడి వస్తుంది. ఒక్క కాతకు 500 నుంచి 600 కిలోల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.1.5 లక్షలు అవుతుంది. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోనూ ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు లాభాలు పొందుతున్నారు.
లాభాలు తగ్గడంతో కీరదోస వైపు దృష్టి
ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్ అమ్మకాలకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదురవుతుండటం.. పెట్టుబడి, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో లాభాలు తగ్గాయి. దీంతో వాటిని తొలగించి ఆ స్థానంలో ఏడాది క్రితం కీరదోస సాగు ప్రారంభించారు. రెండు ఎకరాల్లోని పాలిహౌస్‌ల్లో కీరదోస సాగు చేస్తున్నారు.
స్థానిక మార్కెట్‌లతో పాటు హైదరాబాద్‌కు ఎగుమతి
పండిన కీరదోసను భువనగిరితో పాటు హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి తదితర ప్రధాన మార్కెట్‌లకు తరలిస్తుంటారు. కిలోకు రూ.25నుంచి 30 వరకు ధర పలుకుతుందని.. పెట్టుబడి, రవాణా ఖర్చులు, మార్కెట్‌ను ముందుగానే అంచనా వేసుకుని సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతున్నామని మహిళా రైతు నవనీత చెబుతున్నారు.
సేంద్రియ పద్ధతుల్లో సాగు
కీరదోస సాగులో ఆవుపేడతో పాటు ఇతర సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు తోట వద్దకు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తుంటారని నవనీత చెబుతున్నారు. అంతేకాకుండా నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు.
మొదట్లో క్యాప్సికమ్, చెర్రీ టమాట, కాలిఫ్లవర్ సాగు
తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పంగాల నవనీత ఐదేళ్లుగా సాగులో రాణిస్తోంది. ఆమె భర్త బాలస్వామి వృత్తిరీత్యా ప్రైవేట్ అధ్యాపకుడు. వీరికి ఇద్దరు సంతానం. నవనీతకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. వారికున్న నాలుగు ఎకరాల్లో సంప్రదాయ పంటలు సాగు చేస్తుండేవారు. ఆ పంటల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సొంత ఖర్చులతో రెండు ఎకరాల్లో ఐదేళ్ల క్రితం రెండు పాలిహౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్, దోసకాయ పండించేవారు. ఇందులో ఎరుపు, పసుపు క్యాప్సికంను హైదరాబాద్, బెంగళూర్, ముంబయికి ఎగుమతి చేసేవారు. చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ను స్థానిక మార్కెట్‌లతో పాటు హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు తరలించేవారు.
మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా
ఉన్న కీరదోసకాయలు
ఎక్కువ లాభాలు గడించవచ్చు
కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నందుకు గర్వకారణంగా ఉంది. సేద్యంపై నేను చూపుతున్న శ్రద్ధ ఇతర మహిళలు, రైతులకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది. ఏ సాగులోనైనా ఆధునిక, సేంద్రియ పద్ధతులు అవలంబించడం వల్ల తక్కువ భూమిలోనూ ఎక్కువ లాభాలు గడించవచ్చు. సాగులో నా భర్త సహకారం ఎంతో ఉంది.
– నవనీత, మహిళా రైతు

నవనీత.. సాగులో ఘనత

నవనీత.. సాగులో ఘనత

నవనీత.. సాగులో ఘనత