
నగదు అపహరించిన ముగ్గురి అరెస్ట్
చౌటుప్పల్ : సెకండ్‌హ్యాండ్‌లో కారు కొనేందుకని ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన నలుగురితో కలిసి చౌటుప్పల్‌కు వెళ్లగా అతను వెంట తెచ్చుకున్న నగదును వారు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఈనెల 26న చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ముగ్గురు నిందితులు సోమవారం పోలీసులకు చిక్కారు. ఒకరు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను సీఐ మన్మథకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన వీరగంధం శ్రీనివాస్ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్‌లో కార్లు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. గత 20రోజుల క్రితం సెకండ్‌హ్యాండ్‌లో కార్లు కొనబడును, అమ్మబడును అని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టును చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వేముల పుల్లారావు అలియాస్ శివ(38), కర్నూలు జిల్లా కల్లూరు మండలం శరీన్‌నగర్‌కు చెందిన కర్వాల సునీల్‌కుమార్(45), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మిద్దె జగదీష్‌బాబు(46)తోపాటు బత్తుల సాంబశివరావు అనే వ్యక్తులు శ్రీనివాస్‌ను సంప్రదించారు. తమ వద్ద సెకండ్‌హ్యాండ్ కార్లు ఉన్నాయని, కావాలంటే చూపిస్తామని శ్రీనివాస్‌ను నమ్మబలికారు. అతను చేసేది అదే వ్యాపారం అయినందున కారు కొనుగోలుకు చేసేందుకు సిద్ధమేనని శ్రీనివాస్ వారితో చెప్పాడు.
అందరూ కలిసి
అద్దె కారులో చౌటుప్పల్‌కు..
సెకండ్‌హ్యాండ్‌లో కారును శ్రీనివాస్‌కు ఇప్పించేందుకుగాను పుల్లారావు, సునీల్‌కుమార్, జగదీష్‌బాబు, సాంబశివరావులు కలిసి ఈనెల 26న అద్దెకారులో నాగోల్‌కు చేరుకున్నారు. శ్రీనివాస్‌ను తమ వెంటబెట్టుకొని చౌటుప్పల్ పట్టణంలోని చిన్నకొండూర్‌రోడ్డులో ఉన్న మసీదు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అమ్మకానికి ఉన్న ఓ సెకండ్‌హ్యాండ్ కారును చూపించారు. సంబంధిత కారు యజమాని కొద్దిసేపటి తర్వాత వస్తానని చెప్పడంతో వీరంతా అద్దెకు తీసుకువచ్చిన కారులోనే కూర్చున్నారు. ఇంతలోనే శ్రీనివాస్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ కారు దిగి బయటకు వెళ్లాడు. శ్రీనివాస్ తెచ్చిన రూ.4లక్షలు కారు డ్యాష్‌బోర్డులో ఉండగా.. ఇదే అదునుగా భావించిన మిగతా నలుగురు నిందితులు నగదును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. కొంత సేపటి తర్వాత శ్రీనివాస్ రాగా.. వీరు కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ మన్మథకుమార్ విచారణ చేపట్టారు. ఆ క్రమంలో ధర్మోజిగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వారి వద్ద రూ.4లక్షల నగదు, అద్దె కారు, 5గ్రాముల బంగారం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల సాంబశివరావు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. నిందితులంతా గతంలో దొంగనోట్లు, దొంగ బంగారం కేసుల్లో వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ అయ్యారని చెప్పారు.
పరారీలో మరొకరు
రూ.4లక్షల నగదు, కారు,
బంగారం, సెల్‌ఫోన్లు స్వాధీనం