
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
త్రిపురారం : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిగూడేనికి చెందిన గుండెబోయిన నాగయ్య(50) మాడుగులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామంలోని ఓ వైన్ షాపులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం నాగయ్య భార్య చెరువుగట్టుకు వెళ్లగా నాగయ్య ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. సోమవారం ఉదయం నాగయ్య వైన్ షాపునకు వెళ్లకపోవడంతో షాపు నుంచి అతడికి ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో ఇంటి సమీపంలోని వారికి ఫోన్ చేసి నాగయ్య దగ్గరికి వెళ్లమని చెప్పారు. వారు వెళ్లి చూడగా అతను అపస్మారకస్థితిలో కనిపించాడు. గ్రామస్తులు స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్‌కు సమాచారం అందించారు. నాగయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. మృతుడి భార్య గుండెబోయిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ పేర్కొన్నారు.
గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఫ పరారీలో మరో ఇద్దరు
పెన్‌పహాడ్: గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటన పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన కొంచెం సాయిగణేష్, శాంతినగర్‌కు చెందిన పవన్, అమరగాని లోకేష్‌లు గంజాయికి అలవాటుపడ్డారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు వద్ద గంజాయి కొనుగోలు చేసి వారు తాగడంతో పాటు కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. అనంతారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీసులు వారి స్కూటీని ఆపి తనిఖీ చేశారు. కొంచెం సాయిగణేష్ వద్ద 100గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పవన్, లోకేష్‌లు పరారయ్యారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
చిట్యాల: భార్యాభర్తల మద్య నెలకొన్న మనస్పర్థలతో మనస్థాపానికి గురైన భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ సంఘటన చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టంపల్లి గ్రామానికి చెందిన అంతటి ఉపేందర్(40)కు మునుగోడు మండలం క్రిష్టపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపేందర్ హైదరాబాద్‌లో స్ట్రీల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్టంపల్లి గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వివాదం రావడంతో మనస్థాపానికి గురైన ఉపేందర్ తన ఇంటి సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు. గ్రామస్తులు సర్దిచెప్పడంతో కిందకు దిగాడు.
● మనస్థాపంతో సెల్‌టవర్ ఎక్కిన భర్త