
పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ నెల 28న సోమవారం జరగాల్సిన పోలీస్ గ్రీవెన్స్‌డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇతర కార్యక్రమాల వల్ల గ్రీవెన్స్‌డేను రద్దు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుర్యీ విషయాన్ని గమనించాలని సూచించారు.
కొనసాగుతున్న మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆదివారం ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లు పైకెత్తి ఉంచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక్కో గేటును అడుగు మేర పైకెత్తి ఉంచి 1,286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి 1,287 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 643.30 అడుగుల వద్ద నిలకడగా ఉంచుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 525 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా, ప్రధాన కాల్వలకు, సీపేజీ, లీకేజీల ద్వారా మొత్తం 1,885 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. మూసీ రిర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గోవా మహాసభను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్: గోవాలోని శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఆగస్టు 7వ తేదీన జరుగనున్న జాతీయ ఓబీసీ మహాసభలకు బీసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ భవన్‌లో మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమమల్లయ్య, గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కార్యదర్శులు ఇంద్రయ్య, గంజి భిక్షమయ్య, ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, నల్లం మధుయాదవ్, కందుల వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
పరీక్షలు ప్రశాంతం
నల్లగొండ : గ్రామ పాలనాధికారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకానికి ఆదివారం నల్లగొండలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముసిగినట్లు జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షకు 300 మంది హాజరుకాగా, 78 మంది గైరాజరయ్యారని, గ్రామపాలన అధికారుల పరీక్షకు 110 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్యకల్యాణం కనుల పండువగతా నిర్వహించారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామర్చన తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.