
రాష్ట్రంలో ప్రజారంజక పాలన
చందంపేట : రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో నూతన రేషన్‌కార్డులు మంజూరైన లబ్ధిదారులకు ఆయన.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా జిల్లాతోపాటు దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి తన శాఖా నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ రూ.1800 కోట్లతో ఎదుళ్ల నుంచి డిండి ప్రాజెక్టు నీటిని మళ్లించి ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని అంబాభవాని, కంబాలపల్లి, పొగిళ్ల లిఫ్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి ఈ ప్రాంతంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అర్హులైన వారు రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు దశలవారీగా కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఊపందుకుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డదో రమణారెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి చత్రునాయక్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డి.శైలజ, మార్కెట్ చైర్మన్ జమున, తహసీల్దార్లు శ్రీధర్‌బాబు, ఉమాదేవి, ఎంపీడీఓ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీశైలంయాదవ్, వెంకటయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, బద్యానాయక్, సర్వయ్య, గోవిందుయాదవ్, కిన్నెర హరికృష్ణ, బస్వారెడ్డి, గడ్డం వెంకటయ్య, మల్లారెడ్డి, అనంతగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్