
అనర్హులకు ఇళ్లు ఇస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తాం
డిండి : ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయిస్తే సంబంధిత అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం డిండి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించుకోలేని స్థితిలో ఉన్న వారికి స్వయం సహాయక సంఘం నుంచి రుణం ఇప్పించేలా చూడాలని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. అంతకు ముందు ఆర్‌టీసీ బస్టాండు సమీపంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఎరువులు స్టాక్, రిజిస్టర్, ఈ పాస్ మిషన్‌ను పరిశీలించారు. స్థానిక ఐటీఐ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను పరిశీలించి కోర్సులు, అడ్మిషన్ల వివరాలను ప్రిన్సిపాల్ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహం ఏర్పాటు చేసేందుకుగాను ఐదు ఎకరాల స్థలాన్ని చూడాలని తహసీల్దార్ శ్రీని వాస్‌గౌడ్‌కు సూచించారు. ఆమె వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి, చత్రునాయక్, ఎంపీడీఓ వెంకన్న ఉన్నారు.