
యాదగిరి మాడ వీధిలో ప్రసాద టిక్కెట్ కౌంటర్
యాదగిరిగుట్ట: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడ వీధిలోని అఖండ దీపారధన పక్కన నూతనంగా ప్రసాద టిక్కెట్ కౌంటర్‌ను ఏర్పా టు చేస్తున్నారు. సుమారు రూ.15లక్షలతో 6 టిక్కెట్ కౌంటర్లను 70 గజాల్లో నిర్మాణం చేశారు. ప్రత్యేక గదులు, షెడ్డు, భక్తులు టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా గ్రిల్స్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివాలయానికి వెళ్లే మెట్ల దారిలో లడ్డూ, పులిహోర ప్రసాద టిక్కెట్ కౌంటర్లను గతంలో ఏర్పాటు చేశారు. భక్తులు మెట్ల మార్గంలో వెళ్లి టిక్కెట్ కొనుగోలు చేసి, తిరిగి మెట్లు ఎక్కి ప్రసాద విక్రయ కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులు స్వామిని దర్శించుకొని నేరుగా అఖండఽ దీపారాధన పక్కన ఏర్పాటు చేసిన టిక్కెట్ కౌంటర్‌లో లడ్డూ, పులిహోర టిక్కెట్లు కొనుగోలు చేసి అక్కడి నుంచి ప్రసాద విక్రయశాలకు వెళ్లెందుకు వీలు కల్పించారు. ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులు పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లి, అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద టిక్కెట్ కౌంటర్‌ను శ్రావణమాసం మొదటి రోజు శుక్రవారం ప్రారంభించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
ముగిసిన ‘నవోదయ’ అథ్లెటిక్స్ మీట్
పెద్దవూర: పెద్దవూర మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్స్ మీట్–2025 గురువారంతో ముగిసింది. రాష్ట్రంలోని తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి 68 మంది బాలురు, 46 మంది బాలికలు కలిపి మొత్తం 114 మంది ఈ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొన్నారు. రన్నింగ్, వాకింగ్, హార్డిల్స్, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్ వంటి మొత్తం 21 అథ్లెటిక్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన 25 మంది బాలికలు, 25 మంది బాలురను ఎంపిక చేసి ఈ నెల 27న కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లా మందరాగి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగే రీజనల్ మీట్‌లో పంపించనున్నట్లు జేఎన్‌వీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె. శంకర్ తెలిపారు.

యాదగిరి మాడ వీధిలో ప్రసాద టిక్కెట్ కౌంటర్