
తడకమళ్లలో సబ్‌స్టేషన్ భూమి పరిశీలన
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలోని 719 సర్వే నంబర్‌లో గల సబ్‌స్టేషన్ భూమి ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని తహసీల్దార్ సురేష్ తెలిపారు. సబ్ స్టేషన్ భూమి కబ్జా శీర్షికన ఈనెల 22 సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. దీంతో బుధవారం తడకమళ్ల సబ్ స్టేషన్ స్థలాన్ని ఆర్‌ఐ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఈ భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డు సైతం ఏర్పాటు చేశామని, ఆ బోర్డును తొలగించి భూ కబ్జాకు పాల్పడ్డారన్నారు. ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసచారి మాట్లాడుతూ సబ్‌స్టేషన్ భూమి కబ్జాకు గురైన విషయంపై రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పూర్తి విచారణ అనంతరం భూమిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా గ్రామంలో ఈ భూమి కబ్జా గురించి చర్చ జరుగుతున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును దగ్ధం చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఈ బస్సు దగ్ధం ఘటనలోనూ ఈ భూ కబ్జాదారుడే ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తడకమళ్లలో సబ్‌స్టేషన్ భూమి పరిశీలన