
నిందితులకు శిక్ష పడాలి
నల్లగొండ : ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్షపడేలా చేసినప్పుడే నేరాలు తగ్గుతాయన్నారు. కేసు తుదిదశలో సాక్షులు, నిందితులు, బాధితులు సమయానికి కోర్టులో హాజరుపరిచేలా చూసుకోవాలన్నారు. ఈ ఏడాది ఒకరికి ఉరి శిక్ష, 10 మందికి జీవిత ఖైదు, వివిధ కేసుల్లో 75 మందికి జైలు శిక్షలు పడ్డాయన్నారు. అనంతరం పలువురికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, జవహర్‌లాల్, రంజిత్ కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, కోర్టు డ్యూటీ లైజెనింగ్ ఆఫీసర్ నరేందర్, కోర్టు డ్యూటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పలువురు ఎస్‌ఐల బదిలీ
నల్లగొండ: జిల్లాలో పలువురు ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ అటాచ్‌లో ఉన్న కె.రాజివ్‌రెడ్డి కనగల్‌కు, కనగల్‌లో పనిచేస్తున్న పి.విష్ణుమూర్తి నల్లగొండ సీసీఎస్‌కు, పీఎస్‌ఐ ఎం.సంజీవరెడ్డిని వీఆర్ నల్లగొండ, గట్టుప్పల్ పీఎస్‌కు అటాచ్ చేశారు. సీసీఎస్ నల్లగొండ, గట్టుప్పల్ అటాచ్‌లో ఉన్న జి.వెంకట్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న సిహెచ్.బాలకృష్ణను డిండి పీఎస్‌కు బదిలీ చేయగా, డిండిలో ఉన్న బి.రాజును డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
అధిక మొత్తం వసూలు చేయొద్దు
మిర్యాలగూడ అర్బన్ : మీసేవ కేంద్రాల్లో నిర్ణిత చార్జి కాకుండా అధిక మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ చల్లా దుర్గారావు అన్నారు. శనివారం మిర్యాగూడ పట్టణంలోని 7, దామరచర్ల మండల కేంద్రంలోని రెండు మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం మీసేవ కేంద్రం నిర్వహిచాలని, అధిక వసూళ్లు, ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందింతే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్‌ఎస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఈ–సేవ కేంద్రంలో బయటి వ్యక్తి సేవలు అందిస్తుండటంతో అతడిని బయటకు పంపించారు. ఇకపై ఇలాంటివి పునారావృతం కావొద్దన్నారు. మిగతా అన్నిచోట్లా నిబంధనల మేరకే సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

నిందితులకు శిక్ష పడాలి