
సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కేతేపల్లి: వ్యవసాయం చేసే ప్రతి రైతు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని భూచట్టాల నిపుణుడు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు. లీఫ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సాగు న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం కేతేపల్లిలోని రైతు వేదికలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సవస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించటం కోసమే తాము సాగు న్యాయ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రైతుల భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భూమి ఉండి పాసు పుస్తకం లేకపోయినా, రికార్డుల్లో వివరాలు తప్పుగా నమోదైనా, ఇతర ఏ భూసమస్య ఉన్నా ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సదస్సులో భూదాన్‌బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, ఓఎస్‌డీ శ్రీహరి వెంకటప్రసాద్, కేతేపల్లి ఏఓ బి.పురుషోత్తం, ఆర్‌ఐ వెంకన్న, ఏఈఓలు బాలరాజు, నాగరాజు, ఉమేష్, లీఫ్స్ సంస్థ ప్రతినిధులు జీవన్, అభిలాష్, రవి, ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్