
సోషల్ సర్వీస్!
ఫ సోషల్ మీడియా ద్వారా గ్రామస్తుల బాగోగులు
ఫ ‘మన ఊరు–మన గుజ్జ’ పేరుతో పేజీల నిర్వహణ
ఫ పుష్కరకాలంగా
కృషిచేస్తున్న
యువకుడు శశికాంత్
ఫేస్‌బుక్... యూట్యూబ్... ఇన్‌స్టాగ్రామ్... వాట్సాప్... ఇలా సోషల్‌మీడియాను యువత సరదా కోసమో, వినోదం కోసమో వినియోగిస్తారనే భావన అనేక మందిలో ఉంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్
మండలం గుజ్జ గ్రామానికి చెందిన శ్రీరామోజు శశికాంత్ మాత్రం వీటి వినియోగంతో సామాజిక సేవ చేస్తున్నారు. డిగ్రీ చేసిన ఈయన ‘మన ఊరు–మన గుజ’ పేరుతో ఆయా వేదికల్లో పేజీలు నిర్వహిస్తూ గ్రామానికి, గ్రామస్తులకు సేవ చేస్తున్నారు. 12 ఏళ్లుగా అప్రతిహతంగా తన కృషిని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆలోచన మాత్రమే తనదని, ఆచరణలో మాత్రం గ్రామం మొత్తం పాలుపంచుకుంటోందని శశికాంత్ చెబుతున్నారు – సాక్షి ప్రతినిధి, నల్లగొండ
గుజ్జ నుంచి దేశ విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. వారితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఎప్పటికప్పుడు ఊరి విశేషాలను చేరవేయడం.. అవసరమైతే వాళ్లూ ఓ చేయి వేసి చేయూత అందించేలా చేయడం ఈ ‘సోషల్ మీడియాల’ గొప్పదనం. గుజ్జ యువతలో సేవాదృక్పఽథాన్ని నింపేలా 2013 నుంచి ఈ ‘సామాజిక ఉద్యమం’ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గుజ్జ గ్రామస్తులకు ఊరిలో ఏం జరుగుతోంది? ఏయే పండుగలు ఎలా జరుగుతున్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఈ పేజ్‌లు అందిస్తున్నాయి.
ఎందరో ఆపన్నులకు ఆసరాగా నిలిచి...
‘మన ఊరు – మన గుజ్జ్ఙ వేదికను శశికాంత్ ఆ గ్రామంలో ఉన్న, గ్రామం నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తుల సహకారంతో ముందుకు నడిపిస్తున్నారు. హఠాన్మరణం పొందిన వారి కుటుంబాలకు, అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రిల్లో వైద్యం అవసరమైన వారికి ఆర్థిక సహాయం, తోడ్పాటు అందేందుకు ఈ శ్రీమన ఊరు–మన గుజ్జ’ పేజీలు పనిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన గంగదేవి తిరుమలేష్ భార్య, నలుగురు పిల్లలకు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నల్లగంటి చందుకు, మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరిన మంగ లింగమ్మకు వైద్యం కోసం, క్రికెట్‌లో ప్రతిభ కనబరుస్తున్న గోపరాజు సాయి అర్జున్‌కు అవసరమైన డబ్బు సమకూర్చడంలోనూ ఈ పేజీలు కీలకపాత్ర పోషించాయి. వీరితో పాటు గ్రామంలో ఉన్న వృద్ధులు, విద్యార్థుల కోసమూ అనేక సహాయ కార్యక్రమాలు వీటి ద్వారా జరుగుతున్నాయి.
సంప్రదాయ, సంస్కృతులు చాటిచెప్పేలా..
శశికాంత్ గుజ్జ గ్రామస్తులతో కలిసి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా సంప్రదాయ, సంస్కృతులు అందరికీ చాటిచెప్పడానికీ కృషిచేస్తున్నారు. వాటికి అద్దం పట్టేలా బతుకమ్మ పాటల పోటీల నిర్వహణ, గ్రామ చరిత్ర, గొప్పదనం వివరిస్తూ.. రెండు బతకమ్మ పాటలు రాసి, పాడించి చిత్రీకరణ చేయించారు. జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, వారి త్యాగాలు ఈ తరం యువతకు తెలిసేలా చేస్తూ వారిలో చైతన్యం నింపుతున్నారు. సేవ చేయాలన్న తపన, ఊరి కోసం పని చేయాలన్న సంకల్పం వారిలో పెరిగేందుకు కృషిచేస్తున్నారు.
గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహణ
ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా పలువురిని ఆకర్షిస్తున్న శశికాంత్ వారితో గ్రామంలో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ మహిళల స్వయం ఉపాధి, స్వయం సమృద్ధి కోసం అవసరమైన ప్రాథమిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో గుజ్జ రైతు వేదిక వద్ద స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తోట రాము సహకారంతో వృత్తి నైపుణ్యాల పెంపుదల, వివిధ పథకాల కింద రుణాలు పొందే అవకాశం, కుటీర పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ సాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ వర్గాల్లో ఉన్నతంగా ఉన్న వారి సహాయ, సహకారంతో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే సేవ
గ్రామస్తుల సహకారంతోనే ‘మన ఊరు– మన గుజ్జ’ సోషల్ మీడియాను ప్రారంభించాను. గ్రామస్తులు ఒక్కొక్కరుగా చేరడంతో సోషల్ మీడియాలో గ్రామస్తులమంతా టీంగా ఏర్పడ్డాం. సహాయ, సహకారాల్లో గ్రామం మొత్తం భాగస్వామ్యమవుతోంది. రాష్ట ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీకి సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేయాలన్నది నా ఆకాంక్ష. అవకాశం ఉన్న వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం.
– శ్రీరామోజు శశికాంత్

సోషల్ సర్వీస్!

సోషల్ సర్వీస్!