
బడికి వేళాయే..
నేడు పాఠశాలలు పునః ప్రారంభం
ఫ ప్రభుత్వ స్కూళ్లను ముస్తాబు చేయించిన విద్యాశాఖ
ఫ వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన బాలలు.. ఇక బడికి పయనం
నల్లగొండ : బడి గంట వేళయింది. ఇన్ని రోజులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద 1483 పాఠశాలలు ఉన్నాయి. అవి గురువారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే శుభ్రపరిచి ప్రారంభానికి సిద్ధం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికే ఆయా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలలను తోరణాలు, బెలూన్లతో ఆలంకరించనున్నారు.
పుస్తకాలు, యూనిఫామ్ సిద్ధం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదవే విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే యూనిఫామ్‌తోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వాటిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలలకు చేర్చారు. మొదటి రోజే విద్యార్థులకు వాటిని అందించనున్నారు.
కొండమల్లేపల్లి పాఠశాల ప్రత్యేకం
కొండమల్లేపల్లి : జిల్లాలో కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. కొండమల్లేపల్లి నాలుగు రోడ్ల కూడలి కావడం, చుట్టుపక్క మండలాల నుంచి కూడా అడ్మిషన్లు రావడమే కాక ఉత్తమ బోధన, పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించడం, ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఉన్నత స్థానాల్లో ఉండడం కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు నమోదు కలిగిన పాఠశాలగా కొండమల్లేపల్లికి పేరు సాధించింది. కొండమల్లేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో గత సంవత్సరం 956 మంది విద్యార్థులు ఉన్నారు. 54 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారు. క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఈ పాఠశాలలో పలు పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడం ఉపాధ్యాయుల ఉత్తమ బోధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పాఠశాల సైన్స్ ప్రయోగాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ కూడా ఉండడంతో పాఠశాలలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థుల నమోదు ఈ పాఠశాలలో ఉండడంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.

బడికి వేళాయే..

బడికి వేళాయే..